ఏపీ పాలిటిక్స్ లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, వారి వైఫల్యాలను ఎండగట్టడం చూస్తుంటాం. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధోరణి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఆమె ప్రధాన టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావడమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఈ క్రమంలో ఆమె చేస్తున్న విమర్శలు జగన్‌ను ఇబ్బంది పెట్టడం పక్కన పెడితే, ఆయనకు రాజకీయంగా వరంగా మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో పాలకపక్షంపై విమర్శలు చేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో పాటు కాంగ్రెస్‌పై కూడా ఉంది. అయితే షర్మిల మాత్రం తన విమర్శల తూటాలను కేవలం తన అన్న జగన్ వైపు మాత్రమే గురిపెడుతున్నారు. వైఎస్ జగన్ త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించడంపై షర్మిల తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారం ఇచ్చినప్పుడు జగన్ ఏం చేశారని, కనీసం సొంత పార్టీ నాయకులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆమె విమర్శించారు. అధికారం కోసం మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అయితే షర్మిల చేస్తున్న ఈ విమర్శలు జగన్‌పై నెగిటివిటీ కంటే కూడా, ఆయన చుట్టూ ఒక రకమైన సానుభూతిని సృష్టిస్తున్నాయి. రాజకీయంగా ఒంటరిని చేసే కొద్దీ జగన్ గతంలో లాగే మళ్ళీ పుంజుకుంటారేమో అనే చర్చ మొదలైంది. మరోవైపు సొంత చెల్లెలే తనను టార్గెట్ చేస్తోందన్న భావన వైసీపీ క్యాడర్‌లోనూ కసిని పెంచుతోంది.
మొత్తంగా చూస్తే షర్మిల చేస్తున్న ఈ పర్సనల్ వార్ వల్ల కాంగ్రెస్‌కు కొత్తగా వచ్చే ఓట్లేమీ ఉండవు. పైగా వైఎస్సార్ అభిమానులు ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను చూసి విసిగిపోతున్నారు. ఒక రకంగా షర్మిల ఎంత తీవ్రంగా విమర్శలు చేస్తే, జగన్ అంతగా వార్తల్లో నిలుస్తున్నారు. ఫలితంగా ఏపీ రాజకీయ క్షేత్రంలో చర్చ అంతా అన్నా-చెల్లెళ్ల మధ్యే తిరుగుతూ, కూటమి ప్రభుత్వంపై ఉండాల్సిన ఫోకస్ మళ్లుతోంది. ఈ పరిణామాలన్నీ అంతిమంగా జగన్‌కు రాజకీయ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.