ఏపీ రాజధాని అమరావతి తొలిసారి అతి పెద్ద హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక్కడ నిర్వహించిన తొలి గణ తంత్ర దినోత్సవం .. దీనికి వేదికగా మారింది. భారీ ఎత్తున 4 ఎకరాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు.. అమరావతి అస్తిత్వాన్ని మరోసారి దేశానికి చాటింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండు లక్షల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆసాంతం ఉల్లాసంగానే కాదు.. రికార్డు సాధించే దిశగా కూడా అడుగులు వేసిందని అంటున్నారు.
త్వరలోనే రాష్ట్ర రాజధానికి చట్ట బద్ధత సాధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి కేంద్రంలోనూ పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. అయితే.. దీనికి ముందు.. జాతీయ పండుగల నేపథ్యా న్ని కూడా జోడించడం ద్వారా.. రాష్ట్రం అనుకున్నది సాధించడం తేలిక అవుతుందన్నది అధికారులు చెబుతున్న మాట. తాజాగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి గవర్నర్ ద్వారా కేంద్రానికి నోట్ పంపించనున్నట్టు తెలిసింది.
రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన ప్రాంతం ఎక్కడైనా రాజధానిగానే పరిగణిస్తారు. ఇదే ఇప్పుడు.. అమరావతికి కలిసి వస్తుందని చెబుతున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను పట్టుబట్టి అమరావతిలో నిర్వహించడం వెనుక కూడా ఈ కారణమే ఉందని చెబుతున్నారు. ప్రతి ప్రభుత్వ విభాగానికి చెందిన శకటాన్ని ప్రదర్శించడం.. సాక్షాత్తూ గవర్నర్ ఇక్కడ నుంచి సందేశం ఇవ్వడం.. అన్ని ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యం.. వంటివి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు అవకాశం కల్పించాయని చెబుతున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ దఫా అమరా వతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అయితే.. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశలో ఉంది. ఈ నేపథ్యంలో రాజధానిలో నిర్వహించిన గణతంత్ర కార్యక్రమం దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్వహించిందేనని అధికారులు చెబుతున్నారు. పార్లమెంటులో చర్చ చేపట్టినప్పుడు.. జాతీయ పండుగను కూడా రాజధానిలో నిర్వహించిన రికార్డు కూడా దీనికి దోహదపడనుందని అంటున్నారు.