వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మన రెబల్ స్టార్ ప్రభాస్, సాధారణంగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. కానీ, ఒకసారి ఆయన ఏదైనా విషయాన్ని షేర్ చేశారంటే అది ఖచ్చితంగా నెట్టింట సంచలనమే అవుతుంది. తాజాగా ఒక యువ నటి పాడిన పాట విన్న డార్లింగ్, ఆమె గొంతుకు ఫిదా అయిపోయారు. నిజంగా చాలా అందమైన గొంతు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ప్రభాస్ మనసు గెలుచుకున్న ఆ నటి ఎవరో తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తనయ రాషా థడాని.
రవీనా టాండన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన రాషా థడాని, గతేడాది `ఆజాద్` అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినా, రాషా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే కేవలం నటనకే పరిమితం కాకుండా, తనకు సంగీతంపై ఉన్న మక్కువను తాజాగా బయటపెట్టింది. `లైకీ లైకా`లో నటిస్తూనే.. ఈ సినిమా కోసం ఆమె తన గొంతును కూడా సవరించుకుంది. ఈ క్రమంలో ఆమె పాడిన `ఛాప్ తిలక్` అనే పాట ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
స్టూడియోలో రాషా పాట పాడుతున్న వీడియోను చూసిన ప్రభాస్, వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దానిని షేర్ చేశారు. ``మంచి అరంగేట్రం. మీ వాయిస్ చాలా బాగుంది. ఛాప్ తిలక్ లో మీ ప్రదర్శన హృదయ పూర్వకంగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్ రాషా`` అంటూ స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ఒక పాన్ ఇండియా స్టార్ నుంచి ఇలాంటి అభినందనలు రావడంతో రాషా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ పోస్ట్‌ను ఆమె రీ-షేర్ చేస్తూ తన కృతజ్ఞతలు తెలియజేసింది. మొత్తానికి ప్రభాస్ వంటి స్టార్ హీరో సపోర్ట్ లభించడంతో, ఈ `ఛాప్ తిలక్` సాంగ్ వ్యూస్ అమాంతం పెరిగిపోతున్నాయి. అదే సమయంలో రాషా సైతం ఒక్కసారిగా వార్తల్లో ట్రెండ్ అవుతోంది.