టాలీవుడ్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండితెరపైనే కాదు, తన హక్కుల రక్షణలోనూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అనుమతి లేకుండా తన పేరును, రూపాన్ని, చివరికి తన గొంతును కూడా వాడుకుంటున్న వారిపై తారక్ చట్టపరమైన యుద్ధం ప్రకటించి విజయం సాధించారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వాడుతూ సెలబ్రిటీల వాయిస్‌లను, ఫోటోలను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాగే జరుగుతుండటంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలు, వీడియోలు లేదా ఏఐ ద్వారా సృష్టించిన వాయిస్‌ని వాణిజ్యపరంగా వాడటం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను నిర్ణీత గడువులోపు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆ బిరుదులన్నీ ఆయన ఆస్తి..!
కేవలం పేరు మాత్రమే కాదు.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘యంగ్ టైగర్’, ‘తారక్’, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ వంటి బిరుదుల విషయంలోనూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పేర్లను వాణిజ్య ప్రకటనలకు లేదా సొంత లాభాల కోసం వాడాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ అనుమతి తీసుకోవాల్సిందే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తానికి ఈ తీర్పుతో ఒక నటుడికి సంబంధించిన కీర్తి, ప్రతిష్టలు చట్టపరంగా పూర్తి రక్షణ పొందినట్లు అయింది.