ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు జనసేన వైపే ఉన్నాయి. ఎప్పుడూ నైతిక విలువలు, సిద్ధాంతాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు, సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జనసేన పార్టీ స్థాపించిన పదేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వాన్ని, పార్టీ ప్రతిష్టను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రక్షణ విషయంలో ఆయన తీసుకునే స్టాండ్ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చింది. అయితే, ఇప్పుడు ఒక మహిళా ఉద్యోగినిని మోసం చేశారనే ఆరోపణలు ఒక ఎమ్మెల్యేపై రావడం పార్టీని డిఫెన్స్‌లో పడేసింది. విదేశీ పర్యటనలు, అభివృద్ధి పనులతో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎంకు, సొంత ఇంటి నుండే ఇబ్బంది మొదలవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత ఎన్నికల్లో పరాజయం పాలై, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీకి ఈ ఘటన ఒక బలమైన ఆయుధంగా దొరికింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదంటూ వైసీపీ మాజీ మంత్రులు విమర్శల వేడి పెంచారు. అడబిడ్డలకు న్యాయం చేస్తామన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన ఎమ్మెల్యే చేసిన పనికి ఏం సమాధానం చెబుతారు? అంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ విషయంలో జనసేనాని మౌనంగా ఉండటం కూడా చర్చనీయాంశమవుతోంది. బాధితురాలు గర్భిణిని చేసి అబార్షన్ చేయించారని తీవ్రమైన ఆరోపణలు చేయడంతో, దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే పార్టీకి క్రమశిక్షణ ఉంటుందని నిరూపించుకోవచ్చు, లేదంటే వైసీపీ చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్లవుతుంది. మరి రాష్ట్ర రాజకీయాలను వేడిక్కిస్తున్న ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.