తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని పార్టీలు, నాయకులు ఎదురు చూసిన మునిసిపల్, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ఇచ్చారు. దీని ప్రకారం.. నామినేషన్లు స్వీకరించేందుకు 4 రోజులు(ఈ నెల 31 వరకు), ఎన్నికలకు 14 రోజులు(రెండు వారాలు) మాత్రమే గరిష్ఠంగా సమయం నిర్దేశించారు. మొత్తంగా 116 మునిసిపాలిటీలకు, ఏడు కార్పొరేషన్ ఎన్నికలకు ఈ షెడ్యూల్ విడుదలైంది. ఇక, హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దీని అనంతరం నిర్ణయించనున్నారు.
సమయం సరిపోతుందా?
అయితే.. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సమయం పార్టీలకు.. నాయకులకు సరిపోతుందా? అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే.. 116 మునిసిపాలిటీలలో జరిగే ఎన్నికలకు వార్డులకు సభ్యులను ఎంపిక చేయడం.. అసంతృప్తులను చల్లార్చడం.. నాయకు లను బుజ్జగించడం.. బలమైన వ్యూహాలు రచించడం.. వంటివి కీలక పార్టీలకు కత్తిమీద సాముగా మారే అవకాశం ఉంది. అయితే.. దీనిని ముందుగానే ఊహించిన కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు.. అసంతృప్తులను ఇప్పటికే బుజ్జగించే పనిని చేపట్టాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ వంటి ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. అందరూ కలసి కట్టుగా ముందుకు సాగాలని సూచించారు.
అయితే.. ఇది ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు చేసిన ప్రయత్నం. కానీ, ఇప్పుడు వాస్తవం తెరమీదికి వచ్చింది. రిజర్వే షన్లు.. మహిళా కోటా ఇలా.. అనేక చిక్కులతోపాటు.. పార్టీ లో బలమైన సామాజిక వర్గాలను సంతృప్తి పరచడం వంటివి పార్టీల కు ఇబ్బందిగానే మారనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోతుందా? అనేది ప్రశ్న. దీనికి తోడు బలమైన వ్యూహాలతో ప్రధాన ప్రతిపక్షం, అధికార పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. వీటికి తోడు.. బీజేపీ, కమ్యూనిస్టులు.. చిన్న చితకా పార్టీలు కూడా తగుదునమ్మ అంటూ.. బరిలో బీభత్సానికి రెడీ అవుతున్నాయి. ఈ పోటీని తట్టుకుని విజయం దక్కించుకునేందుకు ఒక వైపు ప్రయత్నిస్తూనే.. అసంతృప్తులను దారిలోకి తీసుకురావడం మరో ఎత్తు.
పోరు హోరా హోరీ!
అనడానికి.. వినడానికి.. ఇవి స్థానిక ఎన్నికలే అయినా.. అధికార,ప్రధాన ప్రతిపక్షాల మధ్య హోరా హోరీ పోరుకు ఈ ఎన్నికలు నిదర్శనంగా నిలవనున్నాయి. రెండేళ్లపాలనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను రిఫరెండంగా భావించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పార్టీ బయటకు చెప్పకపోయినా.. ఇన్నాళ్ల పాలనపై ప్రజల సంతృప్తిని కొలుచుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ కూడా తన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేయనుంది. ఇక, కవిత రూపంలో మరో పార్టీ కూడా.. ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. ఈ ఎన్నికలు సార్వత్రిక సమరాన్ని మించి ఉంటాయని అంటున్నారు.