కాంగ్రెస్ ప్రభుత్వంలో సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ ను ఇరుకున పెట్టేలా.. ఆయన పని తీరును వేలెత్తి చూపేలా ఆయన మాటలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. సీఎం వద్ద ఉన్న విద్యాశాఖకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తానే విద్యాశాఖా మంత్రిని అయితే కార్పొరేట్ స్కూళ్లను మూసేస్తానని చెప్పిన ఆయన.. తన గురిని సీఎం రేవంత్ పై పెట్టిన తీరు షాకింగ్ గా మారింది. తాను మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలు తనకు తెలీకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయని వాపోయే ఆయన.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వద్ద ఉన్న మంత్రిత్వ శాఖ మీద ఈ తరహా వ్యాఖ్య చేయటమేంటి? అన్నదిప్పుడు ప్రశ్న
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ ప్రాంతంలో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక.. ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు దివంగత ప్రతీక్ రెడ్డి పేరిట ఏర్పాటైన ఫౌండేషన్ సాయంతో రూ.8 కోట్లతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ హంగులతో నిర్మించిన వైనానికి ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
విద్యాహక్కుచట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేదవారికి కల్పించాలని.. నిబంధనలకు విరుద్దంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. తానే విద్యాశాఖా మంత్రిని అయితే కార్పొరేట్ విద్యా సంస్థల్ని మూసివేసి. అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివేలా ఆదేశాలు జారీ చేస్తానని వ్యాఖ్యానించారు.
ఇంత మాట అన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్ని ప్రస్తావించటం విశేషం. కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాధాన్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను సీఎం రేవంత్ మంజూరు చేశారని చెప్పటం చూస్తే. వాత పెట్టి వెన్న రాసినట్లుగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.