పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిజల్ట్ తేడా కొడితే అభిమానులు ఎంతలా రియాక్ట్ అవుతారో ‘ది రాజా సాబ్’ విషయంలో ఇప్పుడు అర్థమవుతోంది. దర్శకుడు మారుతి మేకింగ్‌పై అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఈ నిరసన ధర్నాలూ, రాస్తారోకోల రూపంలో కాకుండా.. చాలా వినూత్నంగా, వింతగా సాగుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ ఒక్క మాట.. ఇప్పుడు పెద్ద తలనొప్పి!
సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మారుతి అతివిశ్వాసంతో ఒక మాట అన్నారు. ``ఒకవేళ సినిమా బాలేకుంటే కొండాపూర్‌లోని నా ఇంటికి వచ్చేయండి, అక్కడే కూర్చుని మాట్లాడుకుందాం`` అంటూ తన అడ్రస్‌ను కూడా చెప్పేశారు. సినిమా ఫలితం మిశ్రమంగా రావడంతో, ఆ మాటను ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు. వందలాది మంది అభిమానులు నేరుగా ఆయన నివాసానికి వెళ్లగా, సెక్యూరిటీ వారిని అడ్డుకుంది. దీంతో దర్శకుడిని కలవలేకపోయిన ఫ్యాన్స్, తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చడానికి ఒక డిజిటల్ ప్లాన్ వేశారు.
మారుతి ఇంటి అడ్రస్‌ను టార్గెట్ చేస్తూ అభిమానులు ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి యాప్స్ ద్వారా వందలాది ఆర్డర్లు బుక్ చేస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. ఈ ఆర్డర్లన్నీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో పెడుతుండటంతో, డెలివరీ బాయ్స్ వరుసగా మారుతి ఇంటి తలుపు తడుతున్నారు. బిర్యానీల నుండి నిత్యావసర వస్తువుల వరకు రకరకాల ఐటమ్స్ ఇంటికి వస్తుండటంతో, వారిని వెనక్కి పంపలేక, డబ్బులు కట్టలేక అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏదేమైనా ఒక దర్శకుడిపై ఇలాంటి వినూత్నమైన నిరసన జరగడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి కావచ్చు. మరి ఈ పరిణామాలపై దర్శకుడు మారుతి స్పందించి ఫ్యాన్స్‌ను కూల్ చేస్తారా? లేక ఈ ఆర్డర్ల ప్రవాహం ఇలాగే కొనసాగుతుందా అన్నది చూడాలి.