సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో దాదాపు మూడు దశాబ్దాల కిందట వచ్చిన ‘బోర్డర్’ సినిమా అప్పట్లో పెద్ద హిట్టయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ చిత్రానికి సీక్వెల్ తీశారు. సన్నీతో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ పాండే ముఖ్య పాత్రలు పోషించారీ చిత్రంలో. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి ప్రోమోలు అంత గొప్పగా అనిపించలేదు. సినిమాకు టాక్ కూడా కొంచెం డివైడ్‌గానే వచ్చింది. రివ్యూలు ఎబోవ్ యావరేజ్‌గా వచ్చాయి. ఇలాంటి టాక్‌తో ఈ రోజుల్లో ఓ సినిమా మనుగడ సాధించడం కష్టమే.
కానీ ‘బోర్డర్-2’కు ఈ టాక్, రివ్యూలు అడ్డంకిగా నిలవలేకపోయాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఆదివారం 50 కోట్ల మార్కును దాటేసింది. ఇక రిపబ్లిక్ డే సెలవు రోజైతే ‘బోర్డర్-2’ అందరి అంచనాలను మించిపోయింది. ఏకంగా రూ.65 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఓవరాల్ వసూళ్లు రూ.200 కోట్ల మైలురాయిని కూడా దాటేశాయి. కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఘనతను అందుకుంది సన్నీ డియోల్ సినిమా.
కొన్నేళ్లు వెనక్కి వెళ్తే సన్నీ డియోల్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయి.. ఆయన ఫేడవుట్ హీరోలా కనిపించారు. ఐతే ‘గదర్’ సీక్వెల్‌తో ఆయన బలంగా బౌన్ బ్యాక్ అయ్యారు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టి సన్నీకి మళ్లీ బంపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఐతే తర్వాతి సినిమా ‘జాట్’ అంతగా ఆడలేదు. కానీ సన్నీ మళ్లీ తన హిట్ మూవీకి సీక్వెల్ చేస్తే.. హిందీ ప్రేక్షకులు విరగబడి చూస్తున్నారు. గత ఏడాది దురంధర్, ఛావా, సైయారా లాంటి భారీ విజయాలు అందుకున్న బాలీవుడ్‌కు కొత్త ఏడాదిలోనూ అదిరే ఆరంభాన్ని ఇచ్చింది సన్నీ మూవీ. ఈ సినిమా ఊపు చూస్తుంటే.. ఫుల్ రన్లో రూ.500 కోట్ల మార్కును అందుకునేలా కనిపిస్తోంది.