మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కేవలం వెండితెరపైనే కాదు, సోషల్ మీడియాలోనూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం గురించి గత రెండేళ్లుగా ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం మరియు గత బంధాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
`లస్ట్ స్టోరీస్ 2` షూటింగ్ సమయంలో విజయ్ వర్మతో ప్రేమలో పడింది తమన్నా. చాలా కాలం చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కానీ, అనూహ్యంగా బ్రేకప్ బాట పట్టి ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయ్యారు. ఇంతకీ వీరు విడిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు. అయితే ఈ విషయంలో తమన్నా ఎట్టకేలకు నోరు విప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తన జీవితంలో రెండుసార్లు తీవ్రంగా బాధపడ్డానని (హార్ట్ బ్రేక్) ఆమె ఎమోషనల్ అయ్యారు. మొదటిసారి టీనేజ్‌లో ప్రేమలో పడ్డానని, అయితే అప్పుడు ప్రేమ కంటే కెరీర్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ బంధం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. కానీ, రెండోసారి ఎదురైన అనుభవం మాత్రం తనను ఆలోచనలో పడేసిందని ఆమె పేర్కొన్నారు.
రెండో వ్యక్తితో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ.. ``కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత అతను నాకు సరైన జోడీ కాదని గ్రహించాను. ఆ బంధంలో అలాగే కొనసాగడం నా వ్యక్తిత్వానికి, నా భవిష్యత్తుకు ప్రమాదకరం అనిపించింది. అందుకే ఆ బంధానికి అక్కడితోనే ముగింపు పలికాను`` అని తమన్నా కుండబద్దలు కొట్టారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది విజయ్ వర్మ గురించేనని నెటిజన్లు గట్టిగా విశ్వసిస్తున్నారు.