ఏ ముహూర్తాన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీని చేయాలనుకున్నాడో కానీ.. దానికి ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయని మైథాలజీ కథను ఆయన తెరకెక్కించాలనుకున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’గా పేరున్న సుబ్రహ్మణ్యస్వామి గాథను భారీ స్థాయిలో విజువల్ వండర్‌లా తీయాలనుకున్నారు. కానీ ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఊరించడమే కానీ.. దీని వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. అంతా అనుకున్న ప్రకారం జరిగితే.. ‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ఇదే. కానీ అతను అట్లీ మూవీ మీదికి వెళ్లిపోయాడు. త్రివిక్రమ్.. వెంకీ సినిమాను మొదలుపెట్టాడు. దీంతో బన్నీ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడని.. ‘ఆదర్శ కుటుంబం’ చేశాక త్రివిక్రమ్ తనతోనే ఈ సినిమా చేస్తాడని ప్రచారం సాగింది.
కానీ మళ్లీ బన్నీ చేతికి ఈ ప్రాజెక్టు వెళ్లినట్లు కొన్ని రోజులు జోరుగా చర్చలు నడిచాయి. కానీ లోకేష్ కనకరాజ్ సినిమాను బన్నీ లైన్లో పెట్టడంతో మళ్లీ తారక్ మీదికి ఫోకస్ మళ్లింది. త్రివిక్రమ్-తారక్ మూవీ పక్కా అని ఒక నిర్ణయానికి వచ్చేశారంతా. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ తర్వాత జూనియర్ చేసే సినిమా ఇదే అన్నారు. కానీ ఇప్పుడు తారక్ లైనప్‌లోకి తిరిగి ‘దేవర-2’ వచ్చి చేరింది. ఆగిపోయిందనుకున్న సినిమాను వచ్చే మే నుంచి మొదలుపెడుతున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఆయన స్టేట్మెంట్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో మళ్లీ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టు మీద అనుమానాలు ముసురుకున్నాయి. ఈ ప్రాజెక్టు విషయంలో దర్శక నిర్మాతలకు అసలు చిత్తశుద్ధి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ ప్రాజెక్టు లేనట్లే అని భావిస్తున్నారు. ఈ అనవసర చర్చకు, అయోమయానికి తెరదించుతూ నిర్మాత నాగవంశీ దీని మీద ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే బెటరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.