బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ-2` మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం నమోదు చేసింది. దీం తో హైదరాబాద్‌లో `అఖండ-భారత బ్లాక్ బస్టర్` పేరుతో మూవీ టీం.. విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈ మూవీ అఖండ విజయం సాధిస్తోందన్నారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను తాను కలుసుకున్నానని.. ఆయన కూడా అభినందించారని తెలిపారు. త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రుల కోసం.. ప్రత్యేకంగా ఈ మూవీని ప్రదర్శించనున్నట్టు చెప్పారు.
అదేవిధంగా అఖండ-2 మూవీని `త్రీ-డీ`లోనూ రూపొందించామన్న బోయపాటి.. దీనిని కూడా ప్రేక్షకులు వీక్షించాలని కోరారు. అనంతరం.. హీరో బాలయ్య మాట్లాడుతూ.. సనాతన ధర్మమే ఈ దేశానికి పట్టుగొమ్మ అని పేర్కొన్నారు. దీనిని కాపాడుకుని.. అనుసరిస్తున్నందుకే దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. అఖండ-2 సినిమా ద్వారా భారత హైందవ ధర్మం.. గర్వంగా మీసం మెలేసిందని చెప్పారు. ``మన ధర్మం, మన గర్వం.. కలగలిపిన సినిమానే అఖండ-2`` అని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క పనికి భగవంతుడు ఒక్కొక్కరిని ఎంచుకుంటారని.. అలానే తాను కూడా అని తెలిపారు. సినిమా అనేది నిత్యావసరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో దర్శకులు, నిర్మాతలు సంకోచించాల్సిన అవసరం లేదన్నారు.
తన పొగరు.. గర్వం అంతా తనను చూసుకునేనని బాలయ్య మరోసారి వ్యాఖ్యానించారు. ``నన్ను చూసుకునే నాకు పొగరు. నా పర్సనాలిటీనే నన్ను ఉసిగొల్పే రివల్యూషన్`` అని చెప్పారు. అఖండ-2 మూవీ కేవలం తెలుగు వారి సినిమానే కాదన్న ఆయ న.. ఇది దేశ సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే సినిమా అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మూవీ అని తెలిపారు. పిల్లలు, మహిళల జోలికి వచ్చే వారికి సింహ స్వప్నమని తెలిపారు. ఈ సినిమా విజయం వెనుక అనేక మంది కృషి ఉందని బాలయ్య సవినయంగా చెప్పారు. తన ఒక్కడి వల్లే సినిమా అద్భుత విజయం దక్కించుకో లేదని.. అనేక మంది నటులు, టెక్నీషియన్ల పాత్ర కూడా ఉందని తెలిపారు.