తన తొలి సినిమా ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్ కావడం.. ఆ సినిమాతో తన అందం, అభినయానికి కూడా మంచి మార్కులే పడడంతో కృతి శెట్టికి అవకాశాల విషయంలో లోటే లేకపోయింది. ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుసగా సినిమాలు వచ్చిపడ్డాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా బాగా ఆడడంతో తెలుగులో ఆమె పెద్ద రేంజికి వెళ్లిపోతుందనిపించింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులతో ఆమె కెరీర్ డౌన్ అయిపోయింది. తెలుగులో దాదాపుగా ఛాన్సులు లేని స్థితికి చేరుకుంది కృతి. ఐతే తమిళంలో డెబ్యూ ఆలస్యం అయినా సరే.. మంచి మంచి సినిమాలు చేస్తుండడంతో అక్కడ ఆమెకు పెద్ద బ్రేక్ వస్తుందనే అంచనాలు కలిగాయి. కార్తి సరసన వా వాత్తియార్ (తెలుగులో అన్నగారు వస్తారు), ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జయం రవితో జీనీ చిత్రాల్లో నటించిందామె. కానీ ఈ మూడు సినిమాల విడుదలలో ఆలస్యం జరుగుతోంది.
ఈ మూడు చిత్రాలూ డిసెంబరులోనే రిలీజవుతాయని వార్తలు వచ్చాయి. కానీ ముందుగా ‘జీనీ’ వెనక్కి వెళ్లింది. తర్వాత ‘వా వాత్తియార్’కు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. డిసెంబరు 12న రావాల్సిన సినిమాకు ఫైనాన్స్ ఇష్యూస్ తలెత్తడంతో రిలీజ్ ఆగిపోయింది. ఇక సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ‘ఎల్ఐకే’ మీదే కృతి ఆశలు పెట్టుకుంది. ఐతే ఈ మూవీ కూడా వాయిదా పడనున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు అదే నిజమైంది. ఈ చిత్రం వాయిదా పడుతున్నట్లు యుఎస్ డిస్ట్రిబ్యూసన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మేకర్స్ కూడా ఇదే విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు రెడీ కాలేదని తెలుస్తోంది. దీనికి కూడా బడ్జెట్ సమస్యలు ఉన్నాయట. అలాగే అనిరుధ్ రవిచందర్ ఇంకా రీ రికార్డింగ్ కూడా పూర్తి చేయలేదట. దీంతో ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి తమిళ డెబ్యూ చాలా ఆలస్యం అయింది. ఎట్టకేలకు తన సినిమాలు తక్కువ గ్యాప్‌లో రిలీజ్ కానుండడంతో కృతి ఎగ్జైట్ అయింది. ‘వా వాత్తియార్’ ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొంది. కానీ చివరికి ఆ చిత్రంతో పాటు మిగతా రెండూ కూడా వాయిదా పడడం ఆమెకు పెద్ద షాక్.