కాపీరైట్ పై తరచూ కోర్టుల్లో కేసులు వేసే అలవాటున్న సినీ ప్రముఖుల్లో దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరున్న ఇళయరాజా పేరు ముందుంటుంది. తన అనుమతి లేకుండా పాటలు.. ట్యూన్లు తీసుకున్నారంటూ ఆయన న్యాయస్థానం తలుపులు తడుతుండటం తెలిసిందే. ఈ మధ్యన విడుదలైన డ్యూడ్ మూవీలోనూ తన పాటల్ని కాపీ చేశారని.. దాన్ని తొలగించాలని.. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ ఇళయరాజా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై తాజాగా విచారణ సాగింది. దీనికి సంబంధించి ఇళయరాజా తరఫు లాయర ఈసారి అనూహ్య ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఒక సినిమా థియేటర్లో.. ఓటీటీలో విడుదలై.. విజయం సాధించిన తరవాత అందులోని పాటల్ని తనవి కాపీ కొట్టారంటూ ఎందుకు కేసు వేశారు? అంటూ ఇళయరాజా తరఫు న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ ప్రశ్నించారు.
అంతేకాదు.. 30 ఏళ్ల క్రితం రూపొందిన పాటల్ని నేటి తరం ప్రేక్షకులు అస్వాదిస్తున్నారని.. దీని వల్ల ఇళయరాజా ఏ విధంగా ప్రభావితం అవుతారన్న ప్రశ్నను ఇళయరాజా తరఫు లాయర్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇళయరాజా అనుమతి లేకుండా..కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించేలా పాటల్నిఆ సినిమాలో వినియోగించినట్లుగా పేర్కొన్నారు.
సదరు పాటల హక్కులు తమ వద్ద ఉన్నాయని.. అందుకే సినిమా నుంచి ఆ పాటల్ని తొలగించాలని.. పాటలకు బ్యాన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఇళయరాజా లాయర్ కోరారు. ఈ నేపథ్యంలో డ్యూడ్ నిర్మాణ సంస్థకు చెందిన లాయర్ కు మద్రాస్ హైకోర్టు ప్రశ్నను సంధించింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇళయరాజా పాటల్ని తరచూ సినిమాల్లో ఎందుకు ఉపయోగిస్తున్నారు? అని ప్రశ్నించారు.
దీనికి డ్యూడ్ మూవీ నిర్మాణ సంస్థ మైత్రీమూవీస్ కు చెందిన లాయర్ స్పందిస్తూ.. సదరు పాటల హక్కులు ఎకో సంస్థ నుంచి సోనీ సంస్థ పొందిందని.. అందుకే ఆ పాటల్ని సినిమాల్లో ఉపయోగించేందుకు సోనీ నుంచి అనుమతి తీసుకున్నట్లుగా వివరించారు. థియేటర్లు.. ఓటీటీ విడదులయ్యే వరకూ పట్టించుకోకుండా ఆ తర్వాత ఎందుకు కేసు వేశారని ప్రశ్నించారు. మద్రాస్ హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఇరు పార్టీలకు చెందిన న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. అనంతరం ఈ కేసు విచారణను తదుపరి వాయిదాకు వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. తుది తీర్పు ఏ విధంగా వస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి