ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల భవన నిర్మాణ పనులకు అమరావతిలో శంకుస్థాపన జరగడం శుభపరిణామమని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా బ్యాంకుల ప్రధాన భవనాల నిర్మాణానికి సీఆర్ డీఏ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అనుకున్న దానికంటే ఎక్కువ వేగంగా రాజ ధాని పనులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు, సహకారం లభిస్తోంద న్నారు. 15 వేల కోట్ల రూపాయలను వేగంగా అందించడం ద్వారా పనులను చేపట్టేందుకు వీలు కుదిరిం దన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారని చెప్పా రు. రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రపంచ స్థాయిలో జరుగుతుందని తెలిపారు.
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు శాయ శక్తులా కృషి చేస్తున్నట్టు చెప్పారు. 29 వేల మంది రైతులు.. 33 వేల ఎకరాలను ఇచ్చారని.. ఇదంతా ల్యాండ్ పూలింగ్‌లోనే అందించారని తెలిపారు. ప్రధాన మంత్రి పునః ప్రారంభించిన అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని, 2028 నాటికి తొలి దశపనులు పూర్తవుతాయని సీఎం చెప్పారు. రాజధాని పనులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో సహకరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తయారవుతుందని చంద్రబాబు చెప్పారు.
ఇవీ.. ప్రధాన బ్యాంకులు
రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు సహా బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణం జరగనుంది. వీటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ ఐసీ, ఎన్ ఐఏఎల్‌సీ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా స్థానికంగా 2500 మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు.