తెలుగుప్రజలకు సుపరిచితమైన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు కేంద్రం కీలక అనుమతిని ఇచ్చింది. దాదాపు 27 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని జవహర్ కాలనీలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ ట్రస్ట్ ద్వారా పేద ప్రజల కోసం బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులు.. రివార్డుల్నిఅందుకున్న ఈ ట్రస్ట్ కు తాజాగా కేంద్రం కీలక అనుమతిని మంజూరు చేసింది.
ఇప్పటివరకు దేశీయ విరాళాలు స్వీకరించేందుకు మాత్రం ట్రస్టుకు అనుమతి ఉంది. అందుకు భిన్నంగా విదేశాల నుంచి సైతం విరాళాలు సేకరించేందుకు వీలుగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టంకింద రిజిస్ట్రేషన్ కు కేంద్రహోంశాఖ ఓకే చెప్పేసింది. విదేశాల నుంచి విరాళాల్ని పొందాలని కోరుకునే స్వచ్ఛంద సంస్థలన్నీ తప్పనిసరిగా 2010 నాటి ఎఫ్ సీఆర్ఏ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తాజాగా దీని కోసం అప్లై చేసుకున్న ట్రస్టుకు కేంద్ర హోం శాఖఓకే చెప్పింది. దీంతో.. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు విదేశాల నుంచి సైతం భారీ ఎత్తున విరాళాలు అందుకే అవకాశం లభిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న ఈ ట్రస్టుకు ఇప్పటికే ఎంతో మంచిపేరు ఉందన్న సంగతి తెలిసిందే. ఎలాంటి మచ్చ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.