ప్రస్తుతమున్న జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరికొన్నింటిని తీసుకొచ్చేందుకు ఏపీలోని కూటమి సర్కారు నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. కొత్తగా మరో మూడు జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 29కు పెరిగినట్లైంది. అదే సమయంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు.. ఒక మండలం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.
జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరిపిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. కొత్తగా వస్తున్న మూడు జిల్లాలేమంటే..
పోలవరం జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం.. చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉంటాయి. చింతూరు డివిజన్ విషయానికి వస్తే.. యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మార్కాపురం జిల్లా విషయానికి వస్తే.. యర్రగొండుపాలెం.. మార్కాపురం.. కనిగిరి.. గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం.. కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. ఈ రెవెన్యూ డివిజన్ లోని యర్రగొండుపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు తుర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్‌లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉంటాయి.
మదనపల్లి జిల్లా విషయానికి వస్తే.. పీలేరు.. నంద్యాల జిల్లాలో బనగానపల్లి.. శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు.