 
    కృష్ణానదికి ఉప నదిగా ఉన్న మున్నేరు కు భారీ ఎత్తున వరద పోటెత్తింది. ఈ మున్నేరు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని సాగు భూములకు నీరు అందిస్తోంది. అయితే.. మొంథా తుఫాను ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. దీంతో మున్నేరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా ఖమ్మంలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. నిలువెత్తు నీరు.. పరిసరాలను ముంచేసింది.
ఈ క్రమంలో 12 కాలనీలు మునిగిపోయినట్టు సర్కారుకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన స్పందించిన ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. అధికారులతో చర్చించారు. నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా వరద నీటి ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోనూ అలెర్టు జారీ చేసింది.
ఇదిలావుంటే.. మున్నేరు కారణంగా.. లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్టు రైతులు తెలిపారు. దీనిని మంత్రి తుమ్మల కూడా ధ్రువీకరించారు. రబీ పంటలు పూర్తిగా మునిగాయని.. రైతులకు పరిహారం అం దించేందుకు సర్కారుతో మాట్లాడతానన్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందేలా చూస్తామ ని హామీ ఇచ్చారు. అనుకోని విపత్తు రావడంతో జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.
ఏపీలో అలెర్ట్
మున్నేరు ఉధ్రుతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్ తో సరిహద్దును పంచుకునే పెనుగంచిప్రోలు ప్రాంతంలోని మున్నేరు వాగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు పెరగడంతో, డ్రోన్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అధికారులు వరద ముంపు ప్రాంతాలను డ్రోన్ల సాయంతో సమీక్షించి, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.