 
    2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో విజయ దుందుభి మోగించడం వెనుక ఎన్నారైల పాత్ర...ముఖ్యంగా అమెరికాలోని ఎన్నారైల పాత్ర కీలకం అన్న సంగతి తెలిసిందే. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ కూటమి పార్టీలకు ఓటు వేశారు. కేవలం ఏపీ భవిష్యత్తు కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి, వ్యయప్రయాసలకు ఓర్చి మరీ ఓటేసి వెళ్లారు.
ఈ క్రమంలోనే తమకు ఎంతో కృతజ్ఞత చూపించిన ఎన్నారైలకు..ఎంతో కొంత తిరిగిచ్చేయాలని యువనేత లోకేశ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని తెలుగు ఎన్నారైలకు ధన్యవాదాలు తెలిపేందుకు లోకేశ్ ప్రత్యేకంగా డల్లాస్ వస్తున్నారు. డిసెంబరు 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు డల్లాస్ లో జరిగే ఈ ధన్యవాద సభకు సకుటుంబ సపరివార సమేతంగా హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రతి వ్యక్తితో లేదా ప్రతి కుటుంబంతో లోకేశ్ ప్రత్యేకంగా ఫొటో దిగుతారు.
ఇదేదో రాజకీయ సభలా కాకుండా అమెరికాలోని తెలుగు ప్రజలు ఒక చోట చేరి జరుపుకునే ఈ ఆత్మీయ సమ్మేళనం అని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు ప్రతీకగా జరగబోయే ఈ సభకు సంస్థలతో సంబంధం లేకుండా, అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రతి కుటుంబం హాజరుకావాలని కోరుతున్నారు. ఆ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ప్రదర్శనలు ఉండబోతున్నాయి. ఆహూతులందరికీ రుచికరమైన అచ్చ తెలుగు విందు భోజనం, వినోదం ఉంటుంది. ఈ ధన్యవాద సభలో పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు, ఐటీ కంపెనీల సీఈవోలతో కూడా లోకేశ్ భేటీ అయ్యే అవకాశముందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కంటే భారీ పెట్టుబడులు ఏపీకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.