 
    ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో `ఫౌజీ` ఒకటి. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ వార్ డ్రామాలో ఇమాన్వి అనే కొత్త నటి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఆయన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఫౌజీ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఈ సినిమా సెట్లో జరిగిన ఓ సరదా సంఘటనను తాజాగా `ది గర్ల్‌ప్రెండ్` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ షేర్ చేసుకున్నారు. ఫౌజీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో రాహుల్ కూడా యాక్ట్ చేస్తున్నారు. తన క్యారెక్టర్ కోసం తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతో కొత్త గెటప్‌లో మేకోవర్ అయ్యారట. ఆ గెటప్ లో రాహుల్‌ను కొందరు గుర్తుపట్టలేకపోయారట. ఈ జాబితాలో మన డార్లింగ్ కూడా ఒకరు.

ఈ విషయాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో రాహుల్ స్వయంగా రివీల్ చేశాడు. రాహుల్ మాట్లాడుతూ.. ``ఒక రోజు షూటింగ్ సెట్‌లో నేను, ప్రభాస్ ఎదురుపడ్డాం. కొంచెం దూరం నుంచే ఆయనకు నేను హలో చెప్పాను. ఆయన కూడా హలో అన్నారు. ఆ తర్వాత మా మధ్య ఒక సీన్ షూట్ అయింది. వెంటనే ప్రభాస్ గారు డైరెక్టర్ హను రాఘవపూడి దగ్గరకు వెళ్లి ‘ఆ యాక్టర్ ఎవరు.. ఎక్కడో చూసినట్టు ఉంది` అని అడిగారంట. అప్పుడు హను గారు నా దగ్గరకు తీసుకొచ్చి ‘ఈయన నా ఫస్ట్ మూవీ అందాల రాక్షసి హీరో’ అని చెప్పడంతో.. రాహుల్ రవీంద్రన్‌నా అంటూ ప్రభాస్ షాక్ అయిపోయారు.
వెంటనే `సారీ అండీ గుర్తుపట్టలేకపోయాను.. ఏం అనుకోకండి` అని నవ్వుతూ మాట్లాడారు. ఈ రోజంతా కనీసం పదిసార్లు ప్రభాస్ వచ్చి నాకు సారీ చెప్పారు. ఏం పర్లేదని చెప్పినా ఆయన వినలేదు`` అంటూ చెప్పుకొచ్చారు. రాహుల్ షేర్ చేసిన ఈ సరదా సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఏదేమైనా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ రాహుల్ కు పదిసార్లు సారీ చెప్పాడంటే డార్లింగ్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో, తన కోస్టార్స్‌కు ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో స్పష్టం అవుతోంది.