 
    మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమాల విషయంలో ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్స్‌కి ఓకే చెప్పే హీరోగా పేరుంది. కానీ ఈసారి ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ కాస్త గందరగోళంలోకి నెట్టేసింది. అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. తేజ్, డైరెక్టర్ దేవాకట్టా మధ్య బంధం వ్యక్తిగత స్థాయిలో బలంగా ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన `రిపబ్లిక్` (2021) డిజాస్టర్ అయింది. అయినప్పటికీ వారి బాండింగ్‌లో ఎటువంటి మార్పులు రాలేదు.
బైక్ యాక్సిడెంట్ తర్వాత తేజ్‌ను మానసికంగా ప్రోత్సహించినవారిలో దేవాకట్టా కూడా ఒకరు. బహుశా అదే అనుబంధం కారణంగా తేజ్, దేవాకట్టా మళ్లీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారట. అయితే కొత్త కథ కాకుండా రిపబ్లిక్ సీక్వెల్ చేయాలని దేవకట్టా భావిస్తున్నాడని.. అందుకు తేజ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా హిట్ సినిమాలకే సీక్వెల్ వస్తుంది. ప్రేక్షకులు ఇష్టపడ్డ కథ, పాత్రల మీద మరోసారి ప్రయోగం చేయడం రిస్క్ తగ్గిస్తుంది. కానీ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే.. అది ధైర్యం కాదు, సాహసమే! సినిమా ఫ్లాప్ అయినా అందులోని కొన్ని ఆలోచనలు, ఐడియాలు విలువైనవిగా ఉంటాయి. బహుశా దేవాకట్టా ఆ ఐడియాను మరింత సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాడేమో. కానీ, ఈసారి ప్రేక్షకులు అదే కాన్సెప్ట్‌పై మరోసారి టికెట్ కట్ చేస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్న.
నిజానికి దేవాకట్టా డైరెక్షన్ టాలెంట్‌పై ఎవరికి అనుమానం లేదు. ప్రస్ధానం, ఆటోనగర్ సూర్యలాంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ రిపబ్లిక్ లాంటి పొలిటికల్ డ్రామా సీక్వెల్ తీయడం అనేది రిస్క్ మూవ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం `డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఏంటి బాసూ?` అంటూ తేజ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.