జ‌గ‌న్ విష‌యంలో సీబీఐ ఫెయిల్‌..!

admin
Published by Admin — October 30, 2025 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత‌ వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు బుధవారం తుది తీర్పు వెల్ల‌డించింది. నాంపల్లి సీబీఐ కోర్టు సీబీఐ వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జగన్‌కు ఊరట కలిగించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జగన్ అక్టోబర్ 11న తన పెద్ద కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్లారు. అయితే, ఈ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ సీబీఐ పిటిషన్ వేసింది. తమకు ఇవ్వబడిన ఫోన్ నెంబర్‌ ద్వారా జగన్‌ను మూడు సార్లు సంప్రదించడానికి ప్రయత్నించామని, కానీ ఆ నెంబర్ పనిచేయలేదని తెలిపింది. మాజీ సీఎం ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నెంబర్ ఇచ్చార‌ని.. అందువల్ల ఆయన విదేశీ పర్యటనలకు ఇక‌పై అనుమతి ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించింది.

జగన్ తరపు న్యాయవాది మాత్రం జగన్ అసలు ఫోనే వాడ‌ర‌ని.. గతంలో కూడా తన సిబ్బంది నంబర్లనే సీబీఐకి ఇచ్చారని గుర్తు చేశారు. లండన్ పర్యటనలో కూడా అదే పద్ధతిని అనుసరించారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు.. జ‌గ‌న్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సీబీఐ వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తదుపరి విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ విజ్ఞప్తి చేసినా కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే, జగన్‌ తన పర్యటన షెడ్యూల్‌ను మార్చి మూడు రోజుల ముందుగానే ఇండియాకు చేరుకున్నారు. అదే అంశాన్ని ఆయన త‌ర‌ఫు న్యాయవాదులు కోర్టు ఎదుట ప్రస్తావించడంతో, సీబీఐ వాదన బలహీనపడింది. దాంతో జ‌గ‌న్ విష‌యంలో సీబీఐ ఫెయిల్ అయింది. కాగా, ఇప్పటికే అక్రమాస్తుల కేసులో విచారణ నత్తనడకన సాగుతుండగా, ఈ తీర్పుతో సీబీఐకు మరో షాక్ త‌గిలిన‌ట్లు అయింది.

Tags
CBI Court Petition YS Jagan YSRCP Ap News Ap Politics CBI
Recent Comments
Leave a Comment

Related News