 
    టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న సినీ కుటుంబాల్లో ఘట్టమనేని వారిది ఒకటి. ఐతే మెగా, నందమూరి, అక్కినేని కుటుంబాలతో పోలిస్తే ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా మరీ ఎక్కువమందేమీ సినీ రంగంలోకి అడుగుపెట్టలేదు. వచ్చిన వాళ్లలో సక్సెస్ అయిన వాళ్లు కూడా తక్కువే. కృష్ణ వారసత్వాన్ని నిలబెడుతూ మహేష్ బాబు.. తండ్రిని మించిన స్టార్‌గా ఎదిగాడు.
కానీ ఆయన అన్నయ్య రమేష్ బాబు విజయవంతం కాలేకపోయాడు. మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ప్రయత్నాలు చేసినా నిలదొక్కుకోలేకపోయింది. సుధీర్ బాబు పడుతూ లేస్తూ సాగుతున్నాడు. ఐతే కొత్త తరంలో మాత్రం చాలామందే సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ సంఖ్య అరడజను దాకా ఉండడం విశేషం.
మహేష్ బాబు తనయుడు గౌతమ్ హీరో కావడం లాంఛనమే. ఐతే ఇప్పటిదాకా తన ఫోకస్ చదువు మీదే ఉంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం కూడా అతను సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక గౌతమ్ సోదరి సితార ఆల్రెడీ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తండ్రితో కలిసి ఒక యాడ్ కూడా చేసింది. భవిష్యత్తులో ఆమె హీరోయిన్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ అరంగేట్ర సినిమా కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. తన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.
తాజాగా మంజుల తనయురాలు జాన్వి ఫొటో షూట్లు బయటికి వచ్చాయి. ఆమె త్వరలోనే హీరోయిన్‌గా అడుగుపెట్టనుందట. జాన్వి ఇంతకుముందే మంజుల డైరెక్ట్ చేసిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. త్వరలో పూర్తి స్థాయి హీరోయిన్ కానుంది. ఇంకోవైపు సుధీర్ బాబు కొడుకులు దర్శన్, చరిత్ కూడా సినిమాల కోసం ట్రైన్ అవుతున్నారు. చరిత్ ఇప్పటికే బాల నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు. మరోవైపు రమేష్ బాబు తనయురాలు భారతి కూడా హీరోయిన్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఆమె కూడా ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటోంది. మొత్తంగా ఘట్టమనేని కుటుంబం నుంచి రాబోయే రోజుల్లో సినిమాల్లోకి అడుగుపెట్టే వారి జాబితా పెద్దగానే ఉంది.