 
    మొంథా తీవ్ర తుఫాను సృష్టించిన విలయం నుంచి ప్రజలను కాపాడుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్రమత్తత కారణంగానే ప్రాణనష్టం జరగకుండా ప్రజలను కాపాడామన్నారు. తాజాగా బుధ వారం ఉదయం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గత నాలుగు రోజులుగా తాను నిరంతరం తఫాను పరిస్థితులపై సమీక్షించినట్టు చెప్పారు. అదేవిధంగా అధికారులు, మంత్రులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి.. భరోసా కల్పించారన్నారు.
అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయడం పట్ల కూడా సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేశారన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ చేరువ అయిందని.. బాధితులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకున్నామని చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు చేసిన దానికంటే కూడా.. వచ్చే రెండు రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారికి ఆర్థిక సాయం అందించా లని సీఎం చంద్రబాబు సూచించారు. ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున గరిష్ఠంగా 3000 రూపాయలు అందిం చాలన్నారు. అదేవిధంగా 25 కిలోల బియ్యం, కందిపప్పు సహా నిత్యావసర సరకులు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాగా.. ఆ వెంటనే.. క్షేత్రస్థాయిలో నాయకులు రంగంలోకి దిగారు. బాధితులకు సొమ్ములు ఇవ్వడంతోపాటు నిత్యావసరాలను అందించారు. కొన్నిచోట్ల ఆటోలు, తేలికపాటి వాహనాలు పెట్టి పునరావాస కేంద్రాల్లోని వారిని ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు.