 
    తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని చాలాకాలం నుంచి టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మొత్తం 18 మందికి ఛాన్స్ ఉండగా...15 మంది ఆల్రెడీ ఉన్నారు. దీంతో, మిగిలిన మూడు బెర్త్ ల తత్కాల్ రిజర్వేషన్ కోసం పదుల సంఖ్యలో ఆశావహులు రేసులో ఉన్నారు. అయితే, అనూహ్యంగా ఆ మూడు స్థానాల్లో ఒకటి టీమిండియా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు దక్కనుందని ప్రచారం జరుగుతోంది.
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న అజహర్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. ఆ క్రమంలోనే అజహర్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏదైనా సరే...మంత్రివర్గంలో ఒక బెర్త్ మైనార్టీలకు కేటీయించడం తెలంగాణలో ఆనవాయితీ. షబ్బీర్ అలీ, మహమూద్ అలీ ఆ కోటాలో వచ్చినవారే. అదే మాదిరిగా అజహర్ కు మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మైనార్టీకి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుట్నుంచో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌తోపాటు ఏఐసీసీ నేతలకు చెప్పానని తెలిపారు. మరోవైపు, అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ నేతలు ఖండించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదని, అటువంటిది మంత్రి పదవి ఎలా ఇస్తారని బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపే అవకాశముంది.