 
    గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి విజయం దక్కించుకున్న చాలా మంది ఎమ్మెల్యేల్లో కొందరు.. పనిచేస్తున్నారు. మరికొందరు.. సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఇంకొందరు వివాదాల్లో మునిగితేలుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో ఎదిగిన మాట వాస్తవం. కానీ.. అదే జెండాను పట్టుకుని పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాల్సి వస్తోందని పార్టీ నాయకులే వ్యఖ్యానిస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరి గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం.
చదలవాడ అరవిందబాబు: నరసరావుపేట నియోజకవర్గంలో విజయం దక్కించుకున్న చదలవాట అరవింద బాబు.. పార్టీలు మారి.. టీడీపీలోకివచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించారు. తొలిరోజుల్లో ఆయన ప్రజలకు బాగానే చేరువ అయ్యారు. కానీ, తర్వాత.. కాలంలో తన అనుచరులు మద్యం అమ్ముతున్నారన్న కేసులో అరెస్టయినప్పుడు.. ఎక్సైజ్ అధికారులపై దురుసుగా వ్యవహరించారు. దీంతో చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన ఊసు ఎక్కడా వినిపించడం లేదు.
కొలికపూడి శ్రీనివాసరావు:  తిరువూరు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న అమరావతి ఉద్యమ నాయకు డు. కానీ, తరచుగా వివాదాల చుట్టూ తిరుగుతుంటారు. నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని చెబుతున్నా.. ఆమేరకు ఆయన ఏమీ చేయడం లేదన్నది వాస్తవం. మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వరకే ఆయన పరిమితం అవుతున్నారన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. వచ్చేసారి టికెట్ కష్టమనే భావనా వ్యక్తమవుతోంది.
మాలకొండయ్య: చీరాల నుంచి విజయం దక్కించుకున్న ఈయన.. పార్టీ బలోపేతం పేరుతో వైసీపీ నేతలను స్వాగతించారు. కానీ, ఇది బెడిసి కొట్టింది. చీరాల కౌన్సిల్‌ను దక్కించుకున్నా.. ఆయన వారిపై పట్టు సాధించలేక పోయారు. పైగా వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఈ నియోజకవర్గంలో వివాదాలు నిత్యంసాగుతున్నాయి. అందరి వేళ్లూ ఎమ్మెల్యే వైపే చూపిస్తున్నాయి.
గురజాల జగన్మోహన్:  చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న జగన్మోహన్..  అనుకున్న విధంగా ముందుకు సాగలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈయన కూడా.. వైసీపీ నాయకులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని.. అనేక ఫిర్యాదులు అధిష్టానం ముందు పెండింగులో ఉన్నాయి. ఇక, ఈ నియోజకవర్గం చంద్రబాబు జిల్లా పరిధిలో ఉండడం.. ఎమ్మెల్యేతీరుపై అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది సందేహంగానే ఉంది.