ఏపీని వణికించిన మొంథా పెను తుపాను నిన్న అర్ధరాత్రి తీరం దాటిన సంగతి తెలిసిందే. అయితే, పెను తుపాను నుంచి తుపానుగా మారిన మొంథా ఎఫెక్ట్ తో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, ఈ తుపాను దెబ్బకు చేతికందిన పంట నష్టపోయామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రంగంలోకి దిగారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో  హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పంట నష్టం తీవ్రతను స్వయంగా తెలుసుకోబోతున్నారు.
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ పరిస్థితులను సమీక్షించిన తర్వాత కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు వద్ద చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. రైతులను పరామర్శించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అంతకుముందు, తుపాను నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యల వల్లే నష్టం తక్కువగా జరిగిందని చంద్రబాబు అన్నారు. సీఎంవో నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అందరి సమిష్టి కృషి వల్లే ఒక బృందంగా పనిచేశారని ప్రశంసించారు. మరో 2 రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే బాధితులకు ఊరట లభిస్తుందన్నారు. ఈ సారి సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామని, ఈ నూతన విధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని  అన్నారు.