బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో రాష్ట్రంలో ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేస్తారని భావిస్తున్న రాజకీయ మాజీ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ పీకే ఓట్ల చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఇక, రాజకీయంగా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ సహా.. అధికార పక్షం బీజేపీ నుంచి కూడా పీకేపై విమర్శల జోరు అందుకుంది. ఆయనను నేరస్తుడని, రాజకీయ బ్రోకర్ అని.. బీజేపీ వ్యాఖ్యానించింది.
 
ఏం జరిగింది?
 
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కింద నకిలీ ఓట్లు తొలగించింది. ఈ క్రమంలో సుమారు 70 వేల ఓట్లు పక్కన పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. అయినా.. ఈసీ ముందుకు సాగింది. ఇదిలావుంటే.. మరో 15 రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పీకే వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది.ఈయనకు పశ్చిమ బెంగాల్‌లోను.. బీహార్‌లోనూ ఓటు హక్కు ఉండడమే దీనికి కారణం. ఈవిషయాన్ని స్థానిక ఎన్నికల అధికారి ఒకరు ఆధారాలతో సహా బయట పెట్టారు.
 
అయితే.. దీనిని పీకే పార్టీ జన్ సురాజ్ వ్యంగ్యంగా తిప్పికొట్టింది. రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెబుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఇటీవల చేపట్టిన సర్‌లో ఎందుకు తొలగించలేదు.. ఇది కేంద్ర ఎన్నికల సంఘం తప్పు.. అని వ్యాఖ్యానించింది. అంతే కాదు.. సర్‌ను ఎవరి కోసం చేపట్టారో కూడా అర్ధం కావడంలేదా? అని ప్రశ్నించింది. ఇక, ప్రతిపక్ష నాయకులు.. ప్రశాంత్ కిషోర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ``పీకే ఆస్తులు ఢిల్లీలో పెట్టుకుంటారు. స్వస్థలం బీహార్ అంటారు. కానీ, ఓటు మాత్రం పశ్చిమ బెంగాల్ లో పెట్టుకుంటారు. ఇది రాజకీయ బ్రోకరిజం కాదా? ఇది నేరం కాదా?`` అని బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.
 
ఎన్నికల సంఘం నోటీసులు..
 
మరోవైపు కేంద్ర ఎన్నికలసంఘం ఈ వ్యవహారం పై తీవ్రంగా స్పందించింది. రెండు చోట్ల ఓట్లు ఉండడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం తీవ్రనేరమని వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాలని పీకేకు నోటీసులు జారీ చేసింది. సమాధానం చెప్పకపోతే.. రెండు ఓట్లను రద్దు చేసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వ్యాఖ్యానించారు. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కూడా ఈ వ్యవహారం కలిసివచ్చింది. ఆదినుంచి పీకేను బీజేపీకి బీ టీంగా పేర్కొంటున్న కాంగ్రెస్.. ఇప్పుడు అసలు నిజాలు వెలుగుచూస్తున్నాయని వ్యాఖ్యానించింది.