 
    సూపర్ స్టార్ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో స్టార్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈసారి ఆ ఇంటి నుంచి తెరంగేట్రం చేయబోతున్నది కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్. ఇప్పటికే నటన, డాన్స్‌లో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న జాన్వీ, ఇప్పుడు పెద్ద తెరపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయింది. జాన్వీ డెబ్యూ కోసం కొన్ని కథలు రెడీ కావడం.. అందులో ఒకదాన్ని ఫైనల్ చేయడం కూడా జరిగిపోయిందని తెలుస్తోంది.

ఈరోజు (అక్టోబర్ 29) జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లి మంజుల ఘట్టమనేని అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సోషల్ మీడియాలో జాన్వీకి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ, “నువ్వు ప్రకాశించే సమయం వచ్చింది. నేను నీ మాయాజాలాన్ని, ప్రతిభను, హృదయాన్ని నమ్ముతాను. బిగ్ స్క్రీన్ నీకోసం వేచి చూస్తుంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను...పుట్టినరోజు శుభాకాంక్షలు నా జాను” అంటూ ఎమోషనల్ నోట్ రాశారు.

మంజుల షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండగా, నెటిజన్లు జాన్వీ అందాలకు ఫిదా అవుతున్నారు. ఏముందండి బాబు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు జాన్వీ ఇండస్ట్రీని ఏలేయడం ఖాయమని ఘట్టమనేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, మంజులకు హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది. ఈ డెబ్యూ ఫిల్మ్ కూడా ప్రకటించారు.

కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మంజులను నటిగా రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో కృష్ణ గారు వెనక్కి తగ్గడంతో..మంజుల నిర్మాతగా మారారు. పెళ్లై పిల్లలు పుట్టాక కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలను పోషించారు. ఆ తర్వాత దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చూపారు. ఇప్పుడు ఆమె వారసురాలు జాన్వీ స్వరూప్ సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధం కావడంతో మంజుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.