 
    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా `ది గర్ల్ ఫ్రెండ్`. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాగా.. దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో రష్మిక బిజీ బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తనకు పుట్టబోయే పిల్లల గురించి మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. “నా పిల్లలు పెద్దవారై, వాళ్ల సొంత ప్రపంచం చూసేంతవరకు నేను బతికి ఉండాలని కోరుకుంటున్నా. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎంత పని చేసినా తగిన విశ్రాంతి అవసరం,” అని తెలిపారు. దానికి రష్మిక సైతం అంగీకరిస్తూ.. ``నేను ఇంకా తల్లి కాలేదు, కానీ నాకు పిల్లలు పుట్టబోతున్నారనే భావన ఇప్పుడే నాలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ ప్రాసెస్ నన్ను ఎంతో ఎమోషనల్ గా, ప్రేరణాత్మకంగా మార్చింది. ఇంకా పుట్టని నా చిన్నారుల గురించి ఆలోచిస్తే, వారికోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. వారిని రక్షించడానికి, వారికోసం యుద్ధం చేయడానికి నేను ఇప్పటి నుంచే ఫిట్ గా ఉండాలి. ఇప్పటినుంచే దాని గురించి నేను బలంగా ఆలోచిస్తున్నాను`` అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రష్మిక–విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరిగినట్లు ఫిలింనగర్ టాక్. త్వరలో వీరి పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి కాకముందే పిల్లల గురించి ఇలా లోతుగా ఆలోచించడం రష్మికను మరోసారి అభిమానుల హృదయాలకు దగ్గర చేసింది.