సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేశారు. అంతేకాదు..వేర్వేరుగానే పనిచేశారు. కానీ, లక్ష్యం, పని మాత్రం ఒక్కటే. అదే.. మొంథా తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయడం, అధికారులకు దిశానిర్దేశం చేయ డం. అయితే.. సీఎం చంద్రబాబు అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వీస్(ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి పని ప్రారంభించగా.. పవన్ కల్యాణ్ మాత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఇరువురు ఒకేసమయంంలో సమీక్ష చేయడం.. అధికారులకుఆదేశాలు జారీ చేయడం విశేషం.
 
క్యాంపు కార్యాలయం నుంచే మొంథా తుఫాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కాకినాడ ప్రాంతంలో తుఫాన్ మంగళవారం ఉదయం తీరం దాటనుండటంతో జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన కీలక సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. ఏ ఒక్కరి ప్రాణానికీ నష్టం జరగడానికి వీల్లేదని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చాలన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.
 
తుఫాను పరిస్థితి ఏంటి?
 
గత రెండు రోజుల నుంచి దోబూచులాడుతున్న మొంథా తుఫాను.. ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చుతోందని వాతావరణ విభాగం పేర్కొంది. బంగాళాఖాతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తుఫాన్ల తీవ్రత పెరుగుతోందని తెలిపింది. 2014-15లో వచ్చిన హుద్ హుద్ తుఫాన్ అత్యంత తీవ్ర నష్టాన్ని కలిగించగా, ప్రస్తుతం ఏర్పడిన 'మొంథా' తుఫాన్ కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో గంటకు 100-120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్ కేంద్రీకృత మైందని చెబుతున్నారు.
 
ఇది.. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలో మీటర్ల వేగంతో ముందుకు కదులుతూ.. దిశను మార్చుకుంటున్నట్టు నిపుణులు చెప్పారు. ప్రస్తుతానికి చెన్నైకి 440కిలో మీటర్లు(ఉదయం 600 కిలో మీటర్ల దూరంలో ఉంది), విశాఖపట్నానికి 530 కిలోమీటర్లు(ఉదయం 700 కిలో మీటర్ల దూరంలో ఉంది.) కాకినాడకి 490 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.