బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వణికి పోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సహాయక చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పవన్ తో కలిసి మొంథా తుపాను ప్రభావం, ప్రభుత్వ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాలకు తక్షణమే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని ఆదేశించారు. యంత్ర  సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. హుద్‌హుద్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటూ, అప్పటి స్ఫూర్తితో ఇప్పుడు పనిచేయాలని పిలుపునిచ్చారు.
పొంగే ప్రమాదం ఉన్న వాగులు, వంకలను కచ్చితమైన అంచనాలతో గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 43 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందని వివరించారు. రాయలసీమలో ప్రస్తుతం వర్షాలు లేనందున కృష్ణా నది ప్రవాహాలను అక్కడి చెరువులకు మళ్లించి, ఒక్క టీఎంసీ నీటిని కూడా వృథా చేయవద్దని జలవనరుల శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు.