 
    కోనసీమ జిల్లాలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారాయి. కారణం టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె గొల్లపల్లి అమూల్య తన భర్తపై పెట్టిన వరకట్న వేధింపుల కేసు. ఈ వ్యవహారం వ్యక్తిగత పరిమితులను దాటి రాజకీయ రంగు ఎక్కించుకుంది. రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా ఇటీవల నియమితులైన అమూల్య, తన భర్త దొమ్మేటి సునీల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని సునీల్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమూల్య ఫిర్యాదు వివరాల ప్రకారం.. చదువుకునే రోజుల నుంచే సునీల్ తో అమూల్య పరిచయం ఉంది. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుని జీవితాన్ని అందంగా మార్చేస్తాను అని సునీల్ మాయ మాటలు చెప్పడంతో వాటిని గుడ్డిగా నమ్మిన అమూల్య అతనితో ఏడడుగులు వేసింది. 2009 మార్చి 4న పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ పెళ్లైన కొద్ది రోజులకే సునీల్ తన వికృత బుద్ధి బయటపెట్టాడని.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశాడని అమూల్య ఫిర్యాదులో పేర్కొంది.
డబ్బుల కోసం నీచంగా ప్రవర్తించాడని.. రెండుసార్లు తనపై హత్యాయత్నం చేశాడని, చివరకు తన ఫోటోలను సైతం మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని అమూల్య పేర్కొన్నారు. ఆమె ఆరోపణల మేరకు రాజోలు పోలీసులు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే ఈ కేసు సాధారణ కుటుంబ వివాదంగా కనిపించినా, రాజకీయ సమీకరణాలతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే అమూల్య ప్రస్తుతం టీడీపీ రాజోలు ఇంఛార్జ్‌గా ఉన్నారు. అదే నియోజకవర్గానికి ఆమె తండ్రి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. సుధీర్గ రాజకీయ నేపథ్యం ఉన్న ఈయన.. 2024 ఎన్నికల ముందు టీడీపీలో నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసినా, విజయం సాధించలేకపోయారు. సూర్యారావు ఇప్పుడు రాజోలు వైసీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. తండ్రీకూతుళ్లు విభిన్న పార్టీలలో ఉండటం, ఇప్పుడు కూతురి వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వివాదం చెలరేగడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.