యువ కథానాయకుడు శర్వానంద్ మూడేళ్ల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క సినిమానే రిలీజ్ చేశాడు. కానీ వచ్చే ఏడాది తన నుంచి మూడు చిత్రాలు రాబోతున్నాయి. ఇలాగే వచ్చే ఏడాది నాన్ స్టాప్ బ్యాటింగ్ చేయబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చివరగా 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ చిత్రాలతో పలకరించాడు చిరు. కానీ గత ఏడాది ఆయన్నుంచి రిలీజ్ లేకపోయింది. 
 
విశ్వంభరను ఈ ఏడాది సంక్రాంతికే అనుకున్నారు కానీ.. అది ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడిపోయింది. దీంతో ఈ ఏడాది కూడా చిరు నుంచి సినిమా లేకపోయింది. కానీ ఆయన ఈ రెండేళ్ల లోటును వచ్చే ఏడాది కవర్ చేసేయబోతున్నారు. చిరు మెగాస్టార్‌గా ఎదిగాక బహుశా ఎన్నడూ ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చి ఉండవు. కానీ తొలిసారిగా ఆ రికార్డు వచ్చే ఏడాది చూడబోతున్నాం.
 
ఆల్రెడీ ‘మన శంకర వరప్రసాద్’ సంక్రాంతికి ఫిక్సయింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాబోతోంది. ‘విశ్వంభర’కు సంబంధించి చిత్రీకరణ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం తీసుకుంటున్నారు. వచ్చే వేసవికి పక్కాగా సినిమా వస్తుందని టీం చెబుతోంది. ఇంకో నెల రోజుల్లో చిరు ఖాళీ అయిపోతారు. ఆ తర్వాత బాబీ సినిమాను మొదలుపెడతారు. బాబీ వేగంగా సినిమాలు తీసేస్తాడన్న సంగతి తెలిసిందే. 
 
వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి కచ్చితంగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది. దసరా లేదంటే ఏడాది చివర్లో చిరు-బాబీ చిత్రం విడుదల కావచ్చు. ఈ చిత్రంలో కార్తి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లుగా తాజాగా ఒక క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నిజంగా చిరు ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేస్తే మెగా అభిమానులకు పండగే.