 
    టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను. యాక్షన్, ఎమోషన్, పంచ్ డైలాగ్స్ మేళవించిన ఆయన సినిమాలు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నాయి. మాస్ మూడ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో బోయపాటి కంటే బాగా తెలిసిన డైరెక్టర్ టాలీవుడ్‌లో చాలా అరుదు. `భద్ర`తో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు అఖండ లెవల్‌కు చేరింది. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో బోయపాటి పది సినిమాలు తీశారు. అల్లు అర్జున్‌తో `సరైనోడు`, రామ్ చరణ్‌తో `నాయక్`, బాలకృష్ణతో `సింహా`, `లెజెండ్`, `అఖండ` వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లు.
టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా భారీ స్టార్డమ్ సంపాదించుకున్న బోయపాటి.. ప్రస్తుతం `అఖండ 2` మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బోయపాటి రూ. 40 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ ఉంది. కానీ 20 ఏళ్ల క్రితం ఆయన తొలి సినిమా ‘భద్ర’ (2005) సమయంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండేది. అసలు బోయపాటి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
నిజానికి భద్ర సినిమా కోసం బోయపాటి రెమ్యునరేషన్ అంటూ ఏమీ లేదు. నిర్మాత దిల్ రాజు బోయపాటికి రెమ్యూనరేషన్ కాకుండా నెలవారీ ఖర్చులకు రూ. 40,000 జీతం ఇచ్చేవారట. అంటే నెల జీతానికి ఆయన సినిమాను తీసిపెట్టాడు. సినిమా కంప్లీట్ కాకముందు అవసరం ఏర్పడటంతో దిల్ రాజు దగ్గర బోయపాటి ఒక లక్ష రూపాయలు తీసుకున్నారట. ఇక సినిమా పూర్తయి సూపర్ హిట్ అయ్యాక దిల్ రాజు బోయపాటిని పిలిచి రూ. 5 లక్షలు చాలు కదా అంటే.. ఆయన ఓకే అనేశారు. దాంతో దిల్ రాజు రూ. 3.5 లక్షల విలువైన ఫోర్డ్ ఐకాన్ కారు, అలాగే రూ. 1.5 లక్షల క్యాష్ బోయపాటికి ఇచ్చారట. ఈ లెక్కన నెల జీతం కాకుండా బోయపాటి తన తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం కేవలం లక్షన్నర. కట్ చేస్తే అదే వ్యక్తి ఇప్పుడు టాలీవుడ్ లో 40 కోట్ల డైరెక్టర్ అయ్యారు. ఇది కేవలం టాలెంట్, డెడికేషన్, మాస్ మైండ్ వల్లే సాధ్యమైంది అనడంతో సందేహం లేదు.