`సితార` ఫేమ్ ప్రముఖ నటుడు సుమన్.. తాజాగా సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు హయాం లోనే హైదరాబాద్ పూర్తిగా డెవలప్ అయిందని తెలిపారు. సైబరాబాద్‌తోపాటు.. ప్రస్తుతం ఉన్న రహదారులు కూడా చంద్రబాబు విజన్‌కు నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఉన్న అనేక పరిశ్రమలు.. ఐటీ రంగంలో వచ్చిన పెనుమార్పులకు చంద్రబాబు రీజన్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ఆయన దూరదృష్టితో చేపడుతున్న పనులు తప్పకుండా విజయం సాధిస్తాయని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు పడుతున్న తపన తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.
 
ఆదివారం విజయవాడకు వచ్చిన సుమన్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. కూటమిని గెలిపించిన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కూటమి హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విశ్వా సం ప్రజలకుఉందన్నారు. చంద్రబాబు వంటి నాయకుడు ఏపీకి లభించడం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానన్నారు . విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రావడం అంటే అంత ఈజీకాదన్న సుమన్.. దీని వెను సీఎం చంద్రబాబు కృషి ఎంతో ఉందని చెప్పారు. తాను తరచుగా ఏపీలో పర్యటిస్తున్నానని.. ప్రజలను కూడా కలుస్తున్నానని వారిఅభిప్రాయాలనే తాను చెబుతు న్నానని తెలిపారు.
 
అదేసమయంలో రాష్ట్రంలో రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారన్న సుమన్.. వారికి కూడామేలు జరిగేలా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. కేవలం వారికి డబ్బులు ఇచ్చి.. పథకాలు అమలు చేస్తే సరిపోతుందని తాను భావించడం లేదన్నారు. వారికి వ్యవసాయంపై అవగాహన మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుని సాగులో లాభాలు వచ్చేలా రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ఐక్యత బాగుందన్న ఆయన.. చంద్రబాబు సారథ్యంలో అందరూ సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.