ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్(మనసులోని మాట) కార్యక్రమంలో తెలంగాణ పోరాట యోధుడు కుమురం భీంకు నివాళులర్పించారు. దీనికి కారణం.. ఈ నెల 22న కుమురం భీం జయంతి. అయితే.. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత.. నాలుగు రోజులకు నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని ఆయనను స్మరించుకోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు.. కరోనా వ్యాక్సిన్ తయారువుతున్న తీరును పరిశీలించేం దుకు ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారు. ఇది అప్పట్లో బీజేపీకి అంతో ఇంతో కలిసి వచ్చింది. ఆయన అప్పట్లో నేరుగా ప్రచారం చేయకపోయినా.. ఆయన రాకను అప్పటి బీజేపీ రాష్ట్ర సారథి, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలానే.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉ ప ఎన్నికల్లో ప్రధాని నేరుగా ప్రచారం చేయకపోయినా.. ఆయన పరోక్షంగా తెలంగాణ సెంటిమెంటును ప్రస్తావించారన్న వాదన ఉంది.
 
ఇంతకీ తన మన్ కీ బాత్‌లో ప్రధాని ఏమన్నారంటే.. నిజాం పాలనపై కుమురం భీం చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. ఆయన పోరాట పటిమను ప్రశంసించారు. ‘‘భారత్‌ను దోచుకోవడానికి బ్రిటిష్ పాలకులు అన్ని మార్గాలను వాడారు. ఆ సమయంలో నిజాంలు పేదలు, గిరిజనులను దోచుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పక్షాన ముక్కు పచ్చలారని చిన్నారి యువకుడు.. 20 ఏళ్ల కుర్రాడు నేనున్నానం టూ.. ముందుకు వచ్చి.. వీరోచితంగా పోరాటం చేశాడు.. ఆయనే కుమురం భీం. 40 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఆయన.. నిజాం సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారు`` అని ప్రధాని పేర్కొన్నారు.
 
ప్రస్తుతం తెలంగాణ సమాజంలోని నేటి తరానికి కుమురం భీం గురించి.. పెద్దగా తెలియదని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుమురం భీం గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. అయితే.. ఈ ప్రస్తావన వెనుక.. జూబ్లీహిల్స్ పోరులో బీజేపీ విజయాన్ని కాంక్షించిన వ్యవహారం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే.. గతంలోనే ఆయన అనేక సందర్భాల్లో మన్‌కీబాత్ నిర్వహించినా.. ఎప్పుడూ కుమురం భీం గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.