 
    టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ శ్రీలీల. `పెళ్లిసందడి` సినిమాతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది. `ధమకా`, `భగవంత్ కేసరి`, `గుంటూరు కారం` వంటి చిత్రాల్లో నటించి తన గ్లామర్, యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్ స్కిల్స్‌తో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. యూత్‌కి హాట్ ఫేవరెట్‌గా మారింది. ప్రస్తుతం శ్రీలీల `మాస్ జాతర` ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అనంతరం రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తాజగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి మరియు తనకు కాబోయే వాడిపై శ్రీలీల ఓపెన్ అయింది. పెళ్లి విషయంపై మాట్లాడిన శ్రీలీల.. తనకు కావాల్సిన జీవిత భాగస్వామి గురించి స్పష్టంగా చెప్పింది. "నా భర్త అందంగా లేకపోయినా ఫర్వాలేదు... కానీ అతను నన్ను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి" అని ఆమె తెలిపింది. తన సినీ కెరీర్‌కు మద్దతుగా నిలిచే వ్యక్తి కావాలని, తనను మంచిగా చూసుకునే, సరదాగా ఉండే వ్యక్తిని కోరుకుంటున్నానని పేర్కొంది. అన్నింటికంటే ముఖ్యంగా అతడు నిజాయితీగా ఉండాలని.. అలాంటి వ్యక్తితోనే తన పెళ్లి జరుగుతుందని శ్రీలీల స్పష్టం చేసింది.
ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చగా మారాయి. అభిమానులు కూడా ఆమె మాటలపై స్పందిస్తూ.. శ్రీలీలకు తగిన వాడు త్వరలోనే దొరుకుతాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల ప్రేమాయణం నడుపుతున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్ లో గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నారు. అయితే తెరపైనే కాకుండా, తెర వెనుక కూడా కార్తీక్, శ్రీలీల క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. తరచుగా డిన్నర్ డేట్స్ వెళ్తూ మీడియా కంటపడుతున్నారు. మరోవైపు శ్రీలీల ఇప్పటికే పలుమార్లు కార్తీక్ ఇంట దర్శనమిచ్చింది. ఇవన్నీ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఆజ్యం పోశాయి.