సౌత్ ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు అరుదు. ఒకప్పుడు విజయశాంతి.. ఆ తర్వాత నయనతార, అనుష్క లాంటి కొద్దిమందికే ఈ ఘనత దక్కింది. ఐతే అనుష్క కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయిన సంకేతాలు కనిపిస్తుండగా.. నయనతార జోరు మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో ఆమె అవకాశాలు అందుకుంటూ ఉంది. 
 
ఐతే బేసిగ్గా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసే నయన్‌కు ఈ మధ్య కొంచెం డిమాండ్ తగ్గింది. తన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వర్కవుట్ కావడం లేదు. స్టార్ల సరసన సినిమాలు కూడా తగ్గిపోయాయి. స్వయంగా నయనే తమిళ సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇదే సమయంలో తెలుగులో ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకుంటుండడం విశేషం. ఇక్కడ వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది నయన్.
 
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్’ సినిమా చేస్తోంది నయన్. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైట్ అయిన నయన్.. తన రూల్స్ అన్నీ పక్కన పెట్టి ప్రమోషనల్ వీడియోలో కూడా భాగమైంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో తన వర్క్ దాదాపుగా పూర్తయింది. 
 
ఇంతలోనే తెలుగులో మరో క్రేజీ మూవీలో నయన్ ఛాన్స్ పట్టేసినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణతో ఆమె నాలుగోసారి నటించబోతోందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించబోయే భారీ చిత్రంలో నయనతారనే కథనాయికగా ఎంచుకున్నారట. ఇది పీరియడ్ మూవీ అంటున్నారు. బాలయ్యతో ఇప్పటికే సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించింది నయన్. మళ్లీ వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి.