 
    మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నానిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ, జనసేన నేతలను నోటికొచ్చిన బూతులు తిడుతూ నిత్యం ఆయన వార్తల్లో నానుతూనే ఉండేవారు. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీకి ఎదురైన ఘోర ఓటమితో పార్టీ సీనియర్ నేతలలో చాలామంది సైలెంట్ అయ్యారు. ఆ జాబితాలో కొడాలి నాని కూడా ఒకరు. ఒకప్పుడు మీడియా మైక్‌లు కిందపడేలా మాట్లాడిన ఆయన, ఇప్పుడు మాత్రం పూర్తిగా లో ప్రొఫైల్‌లోకి వెళ్లిపోయారు. ఇందుకు తోడు ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో రాజకీయ సభల్లో, ప్రెస్‌మీట్స్‌లో సైతం కనిపించడం తగ్గించేశారు.
అయితే తాజాగా కొడాలి నాని తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో పాల్గొన్న ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనానికి ముందు కొడాలి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో కొడాలితో పాటు మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఉన్నారు.
ఇకపోతే దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన కొడాలి నానిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించే నాని.. తలనీలాలు సమర్పించడంతో చాలా డిఫరెంట్ గా కనిపించారు. కొందరైతే ఆయన్ను కనీసం గుర్తుపట్టలేదు. కొడాలి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ క్రమంలోనే కొడాలి నాని ఇలా మారిపోయారేంటని ఆందోళన చెందుతూ ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు.