వైసీపీ నాయకులకు తరచుగా కొత్త పేర్లు పెడుతున్న మంత్రి నారా లోకేష్.. తాజాగా వారికి `బ్లూ బ్యాచ్` అంటూ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మన్యం జిల్లాలోని గిరిజన గురుకుల హాస్టల్‌లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరిద్దరు విద్యార్థినులు కూడా మృతి చెందారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. వెంటనే చర్యలకు ఉప్రక్రించింది. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది.
 
అదేవిధంగా విద్యార్థినులకు మెరుగైన వైద్యం కూడా అందించింది. అయితే.. దీనిని వైసీపీ వేరేగా ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలోని ఓ పాఠశాలలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. ఇవి ఇక్కడే జరిగినట్టుగా చెబుతోందని పేర్కొన్నారు. వాస్తవానికి అవి నకిలీ వీడియోలని.. గతంలోనే వీటిపై ప్రభుత్వం వివరణ ఇచ్చిందని తెలిపారు. అయినా.. వైసీపీ బ్లూ బ్యాచ్ మాత్రం ఈ నకిలీ సంస్కృతిని వదిలి పెట్టడం లేదన్నారు.
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ ప్రచారం చేస్తూ.. ప్రభుత్వానికిఇ మచ్చలు తీసుకురావాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తున్న వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదని కూడా చెప్పారు. అలవాటుగా మారిన ఈ నేరాలను( హాబి ట్యువల్ అఫెండర్) తక్షణమే కట్టడి చేయాల్సిన అవసరంఉందన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. ఇలాంటి విష ప్రచారాలతో అవన్నీ కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..