 
    సినీ ప్రపంచంలో హీరో – హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ కొంతసేపు మాత్రమే అయినా, కొన్ని జోడీలు మాత్రం తరాల తరబడి గుర్తుండిపోతాయి. అలాంటి అరుదైన కాంబినేషన్‌లో ఒకటి నందమూరి బాలకృష్ణ – నయనతార జోడీ. ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 2009లో వచ్చిన `సింహా` చిత్రంలో తొలిసారి బాలయ్య, నయన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కి నయనతార గ్లామర్, గ్రేస్ కలిసిపోవడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ జంటగా నటించిన `శ్రీరామరాజ్యం`, `జై సింహా` చిత్రాలు కూడా విజయవంతం అయ్యాయి.
అయితే బిగ్ స్క్రీన్ పై ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో `ఎన్‌బీకే111` వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. `వీర సింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ అనంతరం గోపీచంద్, బాలయ్య కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. బాలయ్య మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను గోపీచంద్ రూపొందిస్తున్నారట.
నవంబర్ 7న లాంఛనంగా సినిమాను ప్రారంభించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారని సమాచారం. అయితే ఇందులో కథానాయికగా నయనతారను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల గోపీచంద్ మలినేని, నయనతారను కలిసి కథ వినిపించగా, ఆమెకు స్క్రిప్ట్ తో పాటు తన క్యారెక్టర్ కూడా బాగా నచ్చిందట. అందుకే వెంటనే నయన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. లేడీ సూపర్ పేరును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ప్రాజెక్ట్‌లో నయనతారతో పాటు మరో హీరోయిన్ ను తీసుకునే అవకాశం ఉందని టాక్.