వెండి (సిల్వర్ ) అనేది కేవలం ఆభరణాలకే కాకుండా.. పరిశ్రమ, వైద్య, సాంకేతిక రంగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించే విలువైన లోహం. అయితే ఇటీవల కాలంలో వెండి ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక దశలో కిలో వెండి ధర రూ.2 లక్షల మార్క్ దాటి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ స్థాయి నుంచి ప్రస్తుతం దేశంలో కిలో వెండి 1.70 లక్షల రూపాయలకు చేరుకుంది. వెండి మార్కెట్ పెరుగుదల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటివరకు కేవలం బంగారంపైనే రుణాలు లభించేవి. కానీ ఇకపై వెండిపైనా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుందని అంటున్నారు. దేశంలో వెండి ఆభరణాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.
ఇక నుంచి వాణిజ్య బ్యాంకులు, అలాగే ఎన్‌బీఎఫ్‌సీలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వవచ్చు. బంగారం రుణాలపై ఎలాంటి నియమ నిబంధనలు అయితే ఆర్బీఐ రూపొందించిందో, అలాంటి నియమ నిబంధనలే ప్రస్తుతం వెండి రుణాలపై కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త గైడ్‌లైన్‌ల ప్రకారం.. వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్ పైన రుణం లభిస్తుంది. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై మాత్రం రుణ సౌకర్యం ఉండదు.
అదేవిధంగా ఒక వ్యక్తి గరిష్టంగా 10 కిలోల వరకు వెండి తాకట్టు పెట్టవచ్చు. ఈ వెండిపై గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల లోపు సిల్వర్ కాయిన్స్ కూడా తాకట్టు పెట్టేందుకు అనుమతినిచ్చింది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా ఉంటుంది. ప్రతి దశలో రుణ మంజూరులో లెండింగ్ వాల్యూ మరియు లోన్-టు-వాల్యూ నిష్పత్తి విధిగా పాటించాలి. అంటే వెండి ధరలు తగ్గినా బ్యాంకుకు రిస్క్ తక్కువగా ఉండేలా ఆర్బీఐ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది.