సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల పేరు, ఫొటోలు, వాయిస్‌లను అనుమతి లేకుండా వాడటం సాధారణ విషయంగా మారిపోయింది. కానీ ఇకపై అలాంటి వ్యవహారం మెగాస్టార్ చిరంజీవి విషయంలో జరగదు. ఎందుకంటే ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, లేదా ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను అనుమతి లేకుండా వాడితే జైలుకే. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో ప్రైవేటు సంస్థలు, సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ ఛానెల్స్ సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు, వీడియోలను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాయి. పైగా ఏఐ టెక్నాలజీతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. డీప్‌ఫేక్ టెక్నిక్ ద్వారా సెలబ్రిటీ ముఖం, వాయిస్‌ను అచ్చం నిజంలా రీక్రియేట్ చేస్తున్నారు. దీని వలన ఏది నిజం, ఏది అబద్ధమో గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రచారాలు, బ్రాండ్ ప్రమోషన్లలోనూ ఈ నకిలీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవం, బ్రాండ్ విలువలు, కాంట్రాక్టులు వంటి అంశాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ జాబితాలో చిరంజీవి కూడా ఒకరు. ఆయన ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు.. చిరంజీవి పిటిషన్‌ను పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇకపై చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్ ను ఆయన అనుమతి లేకుండా ఎవరూ వాడకూడదు. ఐఏ ఆధారిత వీడియోల్లో ఆయన ఫోటోలు, వీడియోలు ఉపయోగించకూడదు. MEGA STAR, CHIRU, ANNAYYA పేర్లతో డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు చేయరాదు. టీవీ రేటింగ్స్, సోషల్ మీడియా ఫేమ్ కోసం, వ్యక్తిగత హాస్యం పేరుతో చిరుపై తప్పుడు ప్రచారం చేయకూడదు. అనుమతి లేకుండా అలా చేస్తే నేరం అవుతుంది. నేరానికి పాల్పడిన సదరు వ్యక్తులు, సంస్థలపై.. కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ నిబంధనలను ఉల్లంఘించిన 30 మందికి నోటీసులు పంపినట్లు సమాచారం. తదుపరి విచారణ అక్టోబర్ 27న జరగనుంది.