ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న వ్యవహారం `నకిలీ మద్యం`. అధికార టీడీపీకి చెం దిన నేతలే దీనివెనుక ఉండి.. సర్వం సహా తామే నడిపించిన ఈ వ్యవహారం.. సర్కారుకు తీవ్ర ఇబ్బంది కర పరిణామంగా మారింది. ఒకవైపు.. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుగు తున్న సమయంలో అనూహ్యంగా ఈ నకిలీ మద్యం వ్యవహారం తెరమీదికి రావడం.. దీనివెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని అధికారులే బహిర్గతం చేయడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఈ క్రమంలో ముందస్తు మందు అన్నట్టుగా పార్టీ నాయకులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఏం జరిగింది?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్న ముకలపల్లి ప్రాంతం శివారులో విజయ వాడ, తెనాలి సహా చిత్తూరుకు చెందిన కొందరు మద్యం వ్యాపారులతో టీడీపీ నేతలు.. జయచంద్రారెడ్డి తదితరులు కుమ్మక్కై.. నకిలీ మద్యం తయారీకి తెరలేపారు. అత్యంత నాసిరకమైన మద్యాన్ని నాణ్యమైన బ్రాండ్ల పేరుతో తయారు చేసి.. వాటిని నేరుగా వైన్స్, బార్లకు.. అధికారికంగా విక్రయించారు. ఈ దందా ఏడాది కాలంగా జరుగుతోందని వార్తలు వస్తున్నా.. సర్కారు పట్టించుకోలేదు.
అయితే.. ఇటీవల.. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారికి వచ్చిన ఫోన్.. స్థానికంగా మద్యం తాగి.. ఆసుపత్రి పాలైన కొందరి వ్యవహారం వంటివి ఈ విషయంపై దర్యాప్తును అనివార్యం చేశారు. ఈ క్రమంలో అధికారులు చేసిన దర్యాప్తులో 6 వేల లీటర్ల బెల్లం ఊట సహా రసాయనాలను పట్టుకున్నారు. 4 వేల బాటిళ్లను.. వాటికి వినియోగించే లేబుళ్లను కూడా(అయితే.. ఇవి స్కాన్ కావడం లేదు. ఇదే పట్టిచ్చింది) తయారు చేసి.. రెడీగా ఉంచుకున్నారు. ఇక్కడ తయారైన మద్యం రూ.5 కావడం.. దీనిని సాధారణ ధరలకే వైన్స్‌ను నాణ్యమైన మందుగా విక్రయించడం గమనార్హం.
ఎవరి పాత్ర?
తంబళ్లపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ చేతిలో ఉంది. అయితే.. ఇక్కడ కార్యక్రమాలను, కార్యకలాపాలను కూడా టీడీపీ నాయకులే నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో జయచంద్రారెడ్డి సహా సురేంద్ర నాయుడులు కీలక పాత్ర పోషించారు. వారే అధికారులను మేనేజ్ చేయడం.. రవాణాకు కూడా సహకరించారని.. దీనిలో వారికి 30 శాతం కమీషన్లు అందాయన్నది ఎక్సైజ్ అధికారులు సర్కారుకు చెప్పిన మాట. దీంతో ఈ వ్యవహారం తారస్థాయిలో వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో సదరు నాయకులపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే.. కేసులో వారి పాత్రను నిరూపించాల్సిందేనని.. కేసులు నమోదు చేయాలని.. ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది.