క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు వారి దూకుడు వారి కారణంగా ఏర్పడుతున్న సమస్యలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిని కలగజేస్తున్నాయి. ఈ నేపద్యంలో సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, సొంత అజెండాలు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు అని కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అయినా ఎక్కడా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు కట్టడి విధించే బాధ్యతను ఇంచార్జ్ మంత్రులుగా ఉన్నవారికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇది ఏమంత తేలిక విషయం కాదనే చెప్పాలి. ఎందుకంటే నిజానికి ఇన్చార్జి మంత్రులే సొంత పెత్తనం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. కొన్ని కొన్ని జిల్లాల్లో అసలు ఇన్చార్జి మంత్రులే కనిపించడం లేదు. మొక్కుబడిగా వెళ్లడం.. మళ్ళీ వెంటనే తిరిగి రావడం వంటివి కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
ఉదాహరణకు కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్ అనంతపురం జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన్ను ఎవరు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. దీనికి ప్రధానంగా సీనియారిటీ కావచ్చు లేకపోతే రాజకీయంగా ఉన్న విభేదాలు కావచ్చు. ఏదైనా కూడా ఇన్చార్జి మంత్రులను స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. ఇక ఎమ్మెల్యేలను కూడా ఇన్చార్జి మంత్రులు పట్టించుకుంటున్నా రా? అంటే అది కూడా లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేలు ఏదైనా సమస్య పై వెళ్తే కాగితం తీసుకోవడం తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదని ఇటీవల అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్మహమాటంగా వెల్లడించారు.
మరి ఇన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి వారికే బాధ్యతలు అప్పగిస్తే ఏ మేరకు ఇది సక్సెస్ అవుతుందన్నది సీఎం చంద్రబాబు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఉండటం కూడా ఇప్పుడు పార్టీకి ప్రయోజనకరంగా కంటే కూడా వివాదపరంగా మారింది అన్నది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వాటిని సరిచేయాలంటే సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకోవాలని, ఆయనే రంగంలోకి దిగాలని చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో నాయకులను స్వయంగా చంద్రబాబు సరిదిద్దాల్సిన అవసరం ఉంది తప్ప ఇన్చార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నది సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా చంద్రబాబు దృష్టి పెడతారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి. ఏది ఏమైనా ఎమ్మెల్యేల తీరు మాత్రం తీవ్ర ఇబ్బందికరంగానే ఉందని చెప్పక తప్పదు.