బైడెన్ పై కమలా హారిస్ షాకింగ్ ఆరోపణలు

admin
Published by Admin — September 11, 2025 in Nri
News Image

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ పై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ షాకింగ్ ఆరోపణలు చేశారు. 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. అది అత్యంత బాధ్యతారహితమైన నిర్ణయమని, దేశ సేవ కన్నా వ్యక్తిగత అహంకారం, ఆశయం కోసం బైడెన్ ఆ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తన ఆత్మకథ ‘107 డేస్’లో కమలా హారిస్ వెల్లడించిన ఈ విషయాలు అమెరికా రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. బైడెన్‌కు అత్యంత విధేయురాలైన కమలా హారిస్ తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"అది జో, జిల్ దంపతుల నిర్ణయం అని మేమంతా ఒక మంత్రంలా పఠించాం. మేమంతా హిప్నటైజ్ అయినట్టుగా ప్రవర్తించాం. వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఆయన చేసిన అతి పెద్ద అవివేకమనిపిస్తోంది" అని కమలా హారిస్ తన పుస్తకంలో రాశారు. దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అహంకారానికి, ఆశయానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సింది కాదని కమలా హారిస్ పశ్చాత్తాపపడ్డారు. తాను ఉపాధ్యక్షురాలిగా ఉన్నందున పోటీ నుంచి తప్పుకోమని బైడెన్‌కు సలహా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానని కమలా హారిస్ చెప్పారు.  సలహా ఇచ్చుంటే అది తన స్వార్థం కోసమే అని, అధికార దాహంతోనే అలా చెప్పానని ఆయన భావించేవారని అభిప్రాయపడ్డారు. వైట్ హౌస్‌లోని బైడెన్ సిబ్బంది తనను నిరంతరం పక్కనపెట్టారని, తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కమలా హారిస్ ఆరోపించారు.

Tags
joe biden kamala harris USA Elections 2024 107 days shocking allegations
Recent Comments
Leave a Comment

Related News