తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కే మణిమకుటంగా మారిన హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు ఆ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపారు. అదే రీతిలో ఏపీ రాజధాని అమరావతిని కూడా నిర్మించేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం త్వరితగతిన పూర్తయ్యేలా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ఏర్పాటు కానుంది. హైదరాబాద్, అమరావతిల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గించేందుకు ఈ రహదారిని ప్రతిపాదించారు.
అందుకు సంబంధించిన అలైన్‌మెంట్ దాదాపుగా ఖరారైంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే కేవలం రెండున్నర గంటల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఆ సమయం నాలుగున్నర గంటలుగా ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా సాగుతుంది. ఆ తర్వాత ఏపీలోని సత్తెనపల్లి మీద నుంచి అమరావతికి చేరుకుంటుంది. ఆ పై లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేను అనుసంధానిస్తారు.
ఓవరాల్ గా 297.82 కి.మీ పొడవున్న ఈ రహదారిలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు, ఏపీ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుత దూరంతో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ దూరం ఉంటుంది. ఇక, ఈ ఎక్స్‌ప్రెస్‌వేను 12 వరుసలతో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఒకవేళ దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే సౌత్ ఇండియాలోనే తొలి 12 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే అవుతుంది. దీనికి రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా.