మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం), ప్రైవేటీకరణల మధ్య తేడా కూడా జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీల అభివృద్ధి కోసం పీపీపీ విధానాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. పీపీపీపై జగన్ కు అవగాహన లేకపోతే పక్కనున్న సలహాదారులను అడిగి తెలుసుకోవాలని జగన్, సజ్జలకు చురకలంటించారు.
ఐదేళ్ల పాలనలో మెడికల్ కాలేజీలను జగన్ సర్కార్ ఎందుకు పూర్తి చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారా లేక విజయవాడ నుంచా అని మీడియా ప్రతినిధులను లోకేశ్ అడిగారు. విజయవాడ నుంచి అని వారు బదులివ్వగా...తాను బెంగళూరు నుంచి మాట్లాడారనుకున్నా అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉంటున్న నేపథ్యంలో లోకేశ్ ఈ విధంగా చురకలంటించారు.
మరోవైపు, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ నిర్వహించిన ఇండియా కాంక్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా జగన్ పై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అనుకుంటే జగన్ ను జైల్లో పెట్టేవాళ్లమని అన్నారు. అది తమ ఎజెండా కాదని తెలిపారు. అయితే, చట్టాన్ని ఉల్లంఘిస్తే జగన్ అయినా..లోకేశ్ అయినా చంద్రబాబు జైలుకు పంపిస్తారని, అందులో మరో ఆలోచన లేదని చెప్పారు.