ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో షాకిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో అల్లు ఫ్యామిలీకి చెందిన ` అల్లు బిజినెస్ పార్క్` లో అక్రమ కట్టడం జరిగిందంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ` పుష్ప 2` వివాదం ఇటీవల గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకతో ముగిసిందని అంతా అనుకున్నారు. ఉత్తమ నటుడుగా రేవంత్ చేతుల మీదగానే బన్నీ అవార్డు అందుకున్నారు. కానీ చివర్లో వేదికపై `ఆ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్లు ఒక్కొక్కడి తలలు రప్పా రప్పా నరుకుతా ` అంటూ బన్నీ పుష్ప మూవీ డైలాగ్ చెప్పడంతో మరింత హీటు పుట్టించినట్లు అయింది.
దాని పరిణామామో ఏమో తెలియదు కానీ.. తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు అల్లు ఫ్యామిలీకి ఊహించని షాకిచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లో రెండేండ్ల కిందట సుమారు 1226 గజాల స్థలంలో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఓ భవనాన్ని నిర్మించారు. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి సంస్థలకు కమర్షియల్ హబ్ ఇది. అల్లు ఫ్యామిలీ సినిమా బిజినెస్, డిజిటల్, ఇతర రంగాల్లో విస్తరించడానికి ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ బేస్.
అయితే ఈ బిల్డింగ్ కు రెండు సెల్లార్లతో పాటు నాలుగు అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతి ఉంది. అయితే ఇటీవల నాలుగు అంతస్తుల పైభాగంలో అదనంగా ఒక పెంట్‌హౌస్ నిర్మించారు. ఈ అక్రమ కట్టడాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నేరుగా అల్లు అరవింద్‌కు షోకాజ్ నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా నిర్మించిన ఈ అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య గత వివాదాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత రాజకీయ రంగు ఎక్కిస్తోంది. మరి ఈ నోటీసులకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ స్పందన ఎలా ఉండబోతుందో.. ప్రభుత్వం భవనం పై ఏమి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి.